సమీక్ష : వీడెవడు – అక్కడక్కడా థ్రిల్ చేసింది


విడుదల తేదీ : సెప్టెంబర్ 15, 2017
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
దర్శకత్వం : తాతినేని సత్య
నిర్మాత : రైనా జోషి
సంగీతం : థమన్ ఎస్.ఎస్
నటీనటులు : సచిన్ జోషి, ఈషా గుప్త






‘భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు తాతినేని సత్య దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘వీడెవడు’. సచిన్ జోషి, ఈషా గుప్త జంటగా నటించిన ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కథ :
సత్య (సచిన్ జోషి) అనే వ్యక్తి పెళ్ళైన పక్క రోజే ప్రాణంగా ప్రేమించిన తన భార్య శ్వేత (ఈషా గుప్త) ను హత్య చేస్తాడు. హత్య విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు అతనికి రిమాండ్ విదిస్తుంది. అలా రిమాండ్లో ఉన్న సత్య చేత అసలు నిజం చెప్పించాలని పోలీసులు ప్రయత్నిస్తుంటారు.
అదే సమయంలో ఒక పోలీస్ అతన్ని చంపాలని కూడా ట్రై చేస్తుంటాడు. అసలు సత్య అతని భార్యను ఎందుకు చంపాడు ? దాని వెనకున్న కారణాన్ని పోలీసులు కనుగొన్నారా లేదా ? సత్యని పోలీసులు ఎందుకు చంపాలనుకుంటారు ? అనేదే ఈ సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
సినిమాలో ప్రధాన ప్లస్ పాయింట్ హీరో హీరోయిన్ ను ఎందుకు చంపాడు అనే సస్పెన్స్. సెకండాఫ్ మధ్య వరకు ఈ ట్విస్టును రివీల్ చేయకుండా కథను నడపడం ద్వారా దానిపై మంచి ఉత్కంఠ క్రియేట్ అయింది. కథనం బోరింగా సాగుతున్నా అసలు హీరోయిన్ హత్య వెనకున్న నిజమేమిటో తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. అలాగే సెకండాఫ్లో బయటపడే ఆ నిజం కూడా పర్వాలేదనిపించింది. కొంత సత్య కేసుని ఇన్వెస్టిగేషన్ చేసే పోలీసాఫీసర్ పాత్రలో కిశోర్ బాగా నటించాడు.
ఒక స్ట్రిక్ట్ పోలీసాఫీసర్ గా అయన నటన, బాడీ లాంగ్వేజ్, డైలాగులు ఆకట్టుకున్నాయి. కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి కామెడీ అక్కడక్కడా నవ్వులు పూయించింది. అలాగే కిశోర్ అసిస్టెంట్ గా చేసిన హర్షవర్ధన్ నటన కూడా బాగుంది. మంచి టైమింగ్ తో ఆయన చెప్పిన డైలాగులు అక్కడక్కడా మెరిశాయి. హీరోయిన్ ఈషా గుప్త కొన్ని చోట్ల గ్లామరస్ గా కనిపిస్తూ కొంత మెప్పించింది.
మైనస్ పాయింట్స్ :
సినిమా ఆరంభం నుండి సెకండాఫ్ మధ్య వరకు సస్పెన్స్ ను కావాలనే దాచిపెట్టిన దర్శకుడు ఏమాత్రం ఆకట్టుకోలేని కథనంతో సినిమాను నడిపి బోర్ కొట్టించాడు. గోవా జైలు బ్యాక్ డ్రాప్లో వచ్చే సన్నివేశాలైతే మరీ విసుగనిపించాయి. హీరోకి బాడీ లైన్ పర్సనాలిటీ డిసార్డర్ ఉందని చెప్పి ఏదేదో చేయిస్తుంటాడు. ఆ సీన్లన్నీ కృత్రిమంగానే అనిపించాయి. హీరో ని నెగెటివ్ షెడ్లో చూపిస్తూ సినిమాను సైకిక్ గా, సస్పెన్స్ గా ముందుకు తీసుకెళ్లాలనే దర్శకుడి ఉద్దేశ్యం బాగున్నా అందుకు కావాల్సిన బలమైన కథనాన్ని రాసుకోకపోవడంతో రిజల్ట్ తారుమారైంది.
హీరో పోలీసుల చేతికి చిక్కినప్పుడే తనలోని నిజాన్ని బయటపెట్టే అవకాశమున్నా, వాస్తవానికి అంతకు ముందే వెల్లడించే పరిస్థితి ఉన్నా ఎందుకంత డ్రామా చేస్తాడో అస్సలు అర్థం కాదు. ఇలా లాజిక్ లేని సన్నివేశాలు చాలానే ఉన్నాయి సినిమాలో. ఆ బోరింగ్ సన్నివేశాలనైనా పక్కాగా తీశారా అంటే అదీ లేదు. చిన్న చిన్న బేసిక్ జాగ్రత్తల్ని కూడా గాలికొదిలేసి సీన్స్ మేకింగ్లో చాలా తప్పులు చేశారు.
గంటున్నరసేపు అస్తవ్యస్తంగా సినిమాను నడిపి చివరి వరకు కీలక నిజాన్ని దాచి ఒక్కసారిగా క్లైమాక్స్ లో రివీల్ చేస్తే ఎగ్జైట్మెంట్ తో ముందు పొందిన విసుగునంతా మర్చిపోయి ప్రేక్షకులు ఇంప్రెస్ అయిపోతారనే పొరపాటు లెక్క వేసిన దర్శకుడు తాతినేని సత్య కంప్లీట్ గా బోల్తాపడ్డారు.
సాంకేతిక విభాగం :
దర్శకుడు తాతినేని సత్య సస్పెన్స్ థ్రిల్లర్ తీద్దామనుకొవడం బాగానే ఉన్నా సరైన కథ, కథనాలు లేకుండా సినిమా చేయడంతో రిజల్ట్ తారుమారైంది. ఏ కోశానా ఆకట్టుకొని కథనం, అనవసరమైన సన్నివేశాలు చాలా చికాకు పెట్టాయి. రైనా జోషీ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
బినేంద్ర మీనన్ సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. థమన్ సంగీతం ఒక పాటలో బాగున్నా మిగతా పాటల్లో నిరుత్సాహానికి గురిచేసింది. కానీ ఆయన చేసిన బ్యాక్ గ్రౌండ్ కొంతమేర ఆకట్టుకుంది. డైలాగ్స్ కూడా ఏదో అలా అలా ఉన్నాయంతే. ప్రవీణ్ పూడి తన ఎడిటింగ్ ద్వారా ఇంకొన్ని అనవసర సన్నివేశాల్ని కట్ చేసి ఉండాల్సింది.
తీర్పు :
దర్శకుడు తాతినేని సత్య గత చిత్రాలు ‘భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్’ వంటి సినిమాలని చూసి ఈ సినిమా చూస్తుంటే ఏంటి ఇలా తీశారు అనిపిస్తుంది. కథలో కీలకమైన నిజం, కొంత కామెడీ మినహా ఆకట్టుకొని బోరింగ్ కథనం, అనవసర, విసిగించే సన్నివేశాలు వంటివి చికాకు పెడతాయి. మొత్తం మీద చెప్పాలంటే సచిన్ జోషి చేసిన ఈ ‘వీడెవడు’ అక్కడక్కడా థ్రిల్ చేసినా రొటీన్ థ్రిల్లర్ సినిమాల జాబితాలో ఒక మూలన మిగిలిపోయే చిత్రం.
123telugu.com Rating : 2.5/5
Followus on facebook.com/Naacinemaa

Comments