సమీక్ష : జై లవ కుశ – అభిమానులు మెచ్చే చిత్రం


విడుదల తేదీ : సెప్టెంబర్ 21, 2017
రేటింగ్ : 3.25/5
దర్శకత్వం : కె.ఎస్ రవీంద్ర
నిర్మాత : నందమూరి కళ్యాణ్ రామ్
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు : ఎన్టీఆర్, రాశీఖన్నా, నివేత థామస్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘జై లవ కుశ’ చిత్రంపై అభిమానుల్లో ఏ స్థాయి అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తారక్ త్రిపాత్రాభినయం చేయడం, టీజర్స్, ట్రైలర్, పాటలు అన్నీ ఆకట్టుకోవడంతో తార స్థాయి క్రేజ్ నెలకొంది. మరి ఇన్ని అంచనాల నడుమ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…

కథ :

అన్నదమ్ములుగా పుట్టిన ముగ్గురు జై, లవ, కుశ లు రామలక్ష్మణ, భరతుల్లా పెరగాలని వాళ్ళ తల్లి ఆశపడుతుంది. కానీ ముగ్గురిలో కొంత లోపంతో పుట్టిన పెద్దవాడైన జైను లవ కుశలు చిన్న చూపుతో హేళనగా చూసి దూరం పెట్టడంతో మనసు గాయపడ్డ జై క్రూరుడిగా మారతాడు. తనకెవ్వరూ లేరు తనకు తానొక్కడే అనుకుని రావణుడిలా తయారవుతాడు.
చివరికి తనకిష్టమైన గుర్తింపును పొందడం కోసమే చిన్నతనంలోనే దూరమైన లవ, కుశలను తిరిగి మళ్ళీ తన దగ్గరకే రప్పించుకుని పంతం నెగ్గించుకోవాలని చూస్తాడు. అసలు జై పొందాలనుకున్న గుర్తింపు ఏమిటి ? లవ, కుశలను తన దగ్గరకు ఎందుకు రప్పించుకున్నాడు ? చివరికి ఈ ముగ్గురి అన్నదమ్ముల జీవితాలు ఎలాంటి మలుపు తిరిగింది ? అనేదే సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు ప్రధాన బలం తారక్ నటనే. మూడు పాత్రల్లోను ఆయన నటించిన తీరు అద్బుతమనే చెప్పాలి. వేషం, భాష, వ్యక్తిత్వం చివరికి శరీరం కదిలే వేగంలో కూడా మూడు పాత్రల్లోనూ మూడు విధాలుగా పెర్ఫార్మ్ చేసి స్పష్టమైన తేడా కనబడేలా నటించాడాయన. ఇదే కథలో ఆయన గనుక లేకపోతే కలగాపులగంగా మారి సినిమా మొత్తం తలకిందులయ్యేదనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతటి టిపికల్ వేరియేషన్స్ ను తారక్ తన నటనతో అరటిపండు వలచినంత స్పష్టంగా కళ్ళ ముందు ఆవిష్కరించాడు. కొన్ని సన్నివేశాల్లో ముగ్గురూ ఒకేలా ఉన్నా కేవలం ఎన్టీఆర్ ఆహార్యాన్ని బట్టే ముగ్గురిలో ఎవరు ఎవరో చెప్పేయవచ్చు. అంత పర్ఫెక్షన్ చూపించాడు తారక్. కేవలం అభిమానులకే కాక అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆయన నటన నచ్చుతుంది.
ఇక దర్శకుడు బాబీ విషయానికొస్తే ఆయన రాసుకున్న లైన్, కొంత కథనం బాగానే ఉన్నాయి. జై తో పాటు కొంచెం చిలిపితనం కలిగిన కుశ, బెరుకుతనం, నిజాయితీ ఉన్న లవ కుమార్ పాత్రల్ని కూడా బాగానే రాసుకున్నాడు. మూడింటిలో వేటికీ అన్యాయం జరగకుండా చూసుకున్నాడు. ఇక తీసిన విధానం చూస్తే ఫస్టాఫ్ మొత్తాన్ని లవ, కుశ పాత్రల మీద కొంత సరదాగా నడుపుతూ ఇంటర్వెల్ లో జై పాత్రను ప్రవేశపెట్టి మంచి బ్రేక్ ఇచ్చాడు. అలాగే సెకండాఫ్లో ముగ్గురు అన్నదమ్ముల మధ్య నడిపిన ఎమోషనల్ సన్నివేశాలు కూడా బాగున్నాయి. జై పాత్ర ఎలివేషన్, ఫైట్స్ మాస్ ఆడియన్సుకి నచ్చుతాయి. రాశీఖన్నా కొంత ప్రాముఖ్యత ఉన్న పాత్రలో అందంగా కనిపిస్తూ మెప్పించింది.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు ప్రధాన మైనస్ ఆకట్టుకునే కథనం లేకపోవడమే. బాబీ కొత్త లైన్ నే పట్టుకుని దాన్ని సగం వరకు బాగానే నడిపినా ఆ తర్వాత మాత్రం పూర్తిగా తేల్చేశాడు. బాగుంది బాగుంది అనుకునేలోపు సినిమాను రొటీన్ దారిలోకి తీసుకెళ్లి దానికి క్యాజువల్ ఎండింగ్ ఇచ్చి కొంత నిరుత్సాహానికి గురిచేశాడు. ఫస్టాఫ్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలకు కూడా అతి సాధారణమైన కారణాలు తప్ప ఔరా అనిపించే రీజన్స్ ఎక్కడా కనబడవు.
ఇక సెకండాఫ్లో జై మిగతా ఇద్దరినీ తన దగ్గరకు రప్పించుకోవడం వరకు బాగున్నా వాళ్ళని వాడుకోవడం మాత్రం పరమ రొటీన్ గానే అనిపించింది. ఇక క్లైమాక్స్ కూడా అన్ని సినిమాల్లాగే ఊహాజనితంగానే ఉంది. పెద్దగా కొత్తదనం, ఉద్వేగం కనబడలేదు. నివేతా పాత్రకు కూడా సరైన రీజన్ కనబదు. పైగా లవ్ ట్రాక్స్ కూడా ఏమంత ఆకట్టుకునే విధంగా లేవు. ఎన్టీఆర్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్, మూడు పాత్రల తీరు చిత్రాన్ని ఎలాగోలా ఒడ్డుకు లాక్కొచ్చాయి.

సాంకేతిక విభాగం :

దర్శకుడు బాబీ సినిమా కోసం ఎంచుకున్న లైన్, జై, లవ, కుశ పాత్రల్ని మలచిన తీరు, అన్నదమ్ముల అనుబంధాన్ని ఎలివేట్ చేసిన విధానం, ఎన్టీఆర్ ను తొలిసారి నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో చూపించి మెప్పించినా, కోన వెంకట్, చక్రవర్తిలు రాసిన కథనంలో పెద్దగా కొత్తదనం, ఆసక్తి లేకపోవడంతో ప్రేక్షకుడికి పూర్తి స్థాయి సంతృప్తి కలగలేదు. ఛోటా కె నాయుడి సినిమాటోగ్రఫీ బాగుంది. జై కోటను, అతని ఊరు భైరాంపూర్ బాగా చూపించారు. మూడు పాత్రల్లో ఎన్టీఆర్ ను మూడు విధాలుగా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసి ప్రేక్షకులకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చేశారు. అలాగే ముగ్గురు కలిసి కబడే ఫ్రేమ్స్ ను సైతం బాగానే హ్యాండిల్ చేశారు.
దేవిశ్రీ ఎప్పటిలాగే తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మెప్పించగా, పాటల సంగీతంతో పర్వాలేదనిపించాడు. ఇకపోతే ఎన్టీఆర్ డ్యాన్సులు, డైలాగులు భీభత్సం అనలేం కానీ బాగున్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగానే ఉంది. కళ్యాణ్ రామ్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి.

తీర్పు :

మొత్తం మీద ‘జై లవ కుశ’ ఎన్టీఆర్ సోలో పెర్ఫార్మెన్స్ మీద నడిచ చిత్రమని చెప్పొచ్చు. మూడు పాత్రల్లో ఆయన నటించిన విధానం ముఖ్యంగా జై పాత్రలో ఆయన నెగెటివ్ నటన అభిమానులకు కొత్త అనుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు. కొత్త లైన్, కొన్ని ఆకట్టుకునే సన్నివేశాలు, సెకండాఫ్లో ఎలివేట్ అయ్యే అన్నదమ్ముల సెటిమెంట్ ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా పెద్దగా కొత్తదనం, ఆసక్తి లేని కథనం, రొటీన్ ఎండింగ్ కొంత నిరుత్సాహానికి గురిచేసే అంశాలు. మొత్తం మీద ఎన్టీఆర్ అద్భుత నటనతో ఈ చిత్రం అభిమానులని అలరించేలా ఉన్నా రెగ్యులర్ ప్రేక్షకులకు యావరేజ్ అనిపిస్తుంది.

Rating : 3.25/5

Click here to Followus on Facebook Naacinemaa

                                               Click here for English Review






Comments